Logo

2సమూయేలు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోనాతానునుబట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైన కలడాయని దావీదు అడిగెను.

02 సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవేగదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను.

03 రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైననొకడు శేషించియున్నాడా యని అతని నడుగగా సీబా యోనాతానుకు కుంటికాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవిచేసెను.

04 అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను.

05 అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పించెను.

06 సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతూ అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.

07 అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని సెలవియ్యగా

08 అతడు నమస్కరించి చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.

09 అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను;

10 కాబట్టి నీవును నీ కుమారులును నీ దాసులును అతనికొరకు ఆ భూమిని సాగుబడిజేసి, నీ యజమానుని కుమారునికి భోజనమునకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను; నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడును నా బల్లయొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు పదునైదుమంది కుమారులును ఇరువదిమంది దాసులును ఉండిరి.

11 నా యేలినవాడగు రాజు తన దాసునికిచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసెదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్లయొద్దనే భోజనము చేయుచుండెను.

12 మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడుండెను, వాని పేరు మీకా. మరియు సీబా యింటిలో కాపురమున్న వారందరు మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి.

13 మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్లయొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్లు రెండును కుంటివి.