Logo

2సమూయేలు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పిమ్మట అమ్మోను రాజు మృతినొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను.

02 దావీదు హానూను తండ్రియైన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని, అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై తన సేవకులచేత సమాచారము పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశములోనికి రాగా

03 అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానూనుతో ఈలాగు మనవిచేసిరి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీయొద్దకు ఓదార్చువారిని పంపెనని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశము చేయవలెనని దాని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించియున్నాడని నీకు తోచలేదా?

04 అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, సగము గడ్డము గొరిగించి, వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిఱ్ఱలమట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను.

05 ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు, ఆ మనుష్యులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుష్యులను పంపించి మీ గడ్డములు పెరుగువరకు యెరికో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనెను.

06 దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేల మంది కాల్బలమును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను, టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.

07 దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను.

08 అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధపంక్తులు తీర్చిరి. సోబా సిరియనులును రెహోబు సిరియనులును మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి.

09 యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధపంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను.

10 అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు

11 అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించినయెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.

12 అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయును గాక అని అబీషైతో చెప్పి

13 యోవాబును అతనితోకూడ నున్నవారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి.

14 సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.

15 అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని గుంపుకూడిరి.

16 హదదెజరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి.

17 హదదెజరు సైన్యాధిపతియగు షోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దానునది దాటి హేలామునకు వచ్చెను.

18 సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులలో ఏడు వందలమంది రథికులను నలువదివేల మంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను.

19 హదదెజరునకు సేవకులగు రాజులందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయము చేయుట మానిరి.