Logo

2సమూయేలు అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.

02 ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱలును గొడ్లును కలిగియుండెను.

03 అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱపిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.

04 అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతునియొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తనయొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.

05 దావీదు ఈ మాట విని ఆ మనుష్యునిమీద బహుగా కోపించు కొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు.

06 వాడు కనికరము లేక యీ కార్యము చేసెను గనుక ఆ గొఱ్ఱపిల్లకు ప్రతిగా నాలుగు గొఱ్ఱపిల్లల నియ్యవలెనని నాతానుతో అనెను.

07 నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలుచేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి

08 నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదావారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.

09 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

10 నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యయగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.

11 నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను.

12 పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

13 నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.

14 అయితే ఈ కార్యమువలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి

15 గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.

16 యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.

17 దావీదు ఉపవాసముండి లోపలికిపోయి రాత్రి అంతయు నేల పడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికయైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.

18 ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను.

19 ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు చనిపోయెననిరి.

20 అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానము చేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగివచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.

21 అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దానికొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా

22 అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చుచుంటిని.

23 ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.

24 తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను.

25 యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా1 అని అతనికి పేరు పెట్టెను.

26 యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను.

27 దావీదునొద్దకు అతడు దూతలను పంపి నేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;

28 నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా

29 దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంత యెత్తుండెను.

30 మరియు అతడు పట్టణములోనుండి బహు విస్తారమైన దోపుసొమ్ము పట్టుకొని పోయెను.

31 పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదునుగల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి.