Logo

2సమూయేలు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.

02 ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడవని యడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా

03 అబ్షాలోము నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి

04 నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడువారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.

05 మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.

06 తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరిని తనతట్టు త్రిప్పుకొనెను.

07 నాలుగు1 సంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చినీ దాసుడనైన నేను సిరియ దేశమునందలి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించెదనని మ్రొక్కు కొంటిని గనుక,

08 నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా

09 రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను.

10 అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగులవారిని పంపెను.

11 విందునకు పిలువబడియుండి రెండువందల మంది యెరూషలేములోనుండి అబ్షాలోముతో కూడ బయలుదేరియుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి.

12 మరియు బలి అర్పింపవలెననియుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహు బలమాయెను.

13 ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా

14 దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.

15 అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.

16 అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.

17 రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.

18 అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరేతీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.

19 రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతో కూడ వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము.

20 నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగులాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొనిపొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా

21 ఇత్తయి నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.

22 అందుకు దావీదు ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి.

23 వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమైపోయిరి.

24 సాదోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను.

25 అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి

26 దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

27 యాజకుడైన సాదోకుతో ఇట్లనెను సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.

28 ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్యమందలి రేవులదగ్గర నిలిచియుందును.

29 కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.

30 అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలు లేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.

31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.

32 దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.

33 రాజు నీవు నాతో కూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;

34 నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టగలవు.

35 అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.

36 సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.

37 దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.