Logo

1రాజులు అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేకమంది పరస్త్రీలను మోహించి

02 కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.

03 అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉపపత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి.

04 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను.

05 సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను.

06 ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.

07 సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండమీద బలిపీఠములను కట్టించెను.

08 తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను.

09 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై

10 నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్దనుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి

11 సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.

12 అయినను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను ఆలాగున చేయక నీ కుమారునిచేతిలోనుండి దాని తీసివేసెదను.

13 రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.

14 యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.

15 దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడినవారిని పాతిపెట్టుటకు వెళ్లియున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.

16 ఎదోములోనున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.

17 అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్నవాడై యుండెను.

18 వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.

19 హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లిచేసికొనిన రాణియైన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లిచేసెను.

20 ఈ తహ్పెనేసుయొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను; ఫరోయింట తహ్పెనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను.

21 అంతట దావీదు తన పితరులతోకూడ నిద్రపొందిన సంగతిని, సైన్యాధిపతియైన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్లుటకు సెలవిమ్మని ఫరోతో మనవిచేయగా

22 ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్లకోరుటకు నాయొద్ద నీకేమి తక్కువైనది అని యడిగెను. అందుకు హదదు తక్కువైనదేదియు లేదు గాని యేలాగుననైనను నన్ను వెళ్లనిమ్మనెను.

23 మరియు దేవుడు అతనిమీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు సోబా రాజైన హదదెజరు అను తన యజమానుని యొద్దనుండి పారిపోయినవాడు.

24 దావీదు సోబావారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి, కూడిన యొక సైన్యమునకు అధిపతియై దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను.

25 హదదు చేసిన యీ కీడు గాక సొలొమోను బ్రదికిన దినములన్నియు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇశ్రాయేలీయులకు విరోధియైయుండి ఇశ్రాయేలీయులయందు అసహ్యత గలవాడై యుండెను.

26 మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజుమీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయీమీయుడైన నెబాతు కుమారుడు, ఇతని తల్లిపేరు జెరూహా, ఆమె విధవరాలు.

27 ఇతడు రాజుమీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రియైన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను.

28 అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.

29 అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను; అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొనియుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.

30 అంతట అహీయా తాను ధరించుకొనియున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసికొనుము;

31 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి,

32 సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను.

33 అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును, నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును.

34 రాజ్యము వానిచేతిలోనుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసికొని అతని దినములన్నియు అతనిని అధికారిగా ఉండనిత్తును.

35 అయితే అతని కుమారుని చేతిలోనుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రముల నిచ్చెదను;

36 నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.

37 నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక యంతటిచొప్పున నీవు ఏలుబడిచేయుచు ఇశ్రాయేలువారిమీద రాజవైయుందువు.

38 నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గముల ననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరింగిచుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను.

39 వారు చేసిన క్రియలనుబట్టి నేను దావీదు సంతతివారిని బాధ పరచుదును గాని నిత్యము బాధింపను.

40 జరిగినదానిని విని సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెను.

41 సొలొమోను చేసిన యితర కార్యములను గూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడియున్నది.

42 సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.

43 అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధి చేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.