Logo

2రాజులు అధ్యాయము 2

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా

02 ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.

03 బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొనిపోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును,మీరు ఊరకుండుడనెను.

04 పిమ్మట ఏలీయా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.

05 యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొనిపోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.

06 అంతట ఏలీయా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగివెళ్లిరి.

07 ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దాను నదిదగ్గర నిలిచిరి.

08 అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడతపెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.

09 వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను.

10 అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.

11 వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరుచేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను

12 ఎలీషా అది చూచి నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.

13 మరియు ఏలీయా దుప్పటి క్రిందపడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి

14 ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.

15 యెరికో దగ్గరనుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలీయా ఆత్మ ఎలీషామీద నిలిచియున్నదని చెప్పుకొని, అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి

16 అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మాయొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి యుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను.

17 అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబదిమందిని పంపిరి. వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను.

18 వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషాయొద్దకు తిరిగిరాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను.

19 అంతట ఆ పట్టణపువారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమైయున్నదని ఎలీషాతో అనగా

20 అతడు క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొనిరండని వారితో చెప్పెను. వారు దాని తీసికొనిరాగా

21 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.

22 కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.

23 అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కివెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా

24 అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.

25 అతడు అచ్చటనుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటనుండి పోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను.