Logo

2రాజులు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;

02 నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలయొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను.

03 ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చెదనని చెప్పి

04 వారితోకూడ పోయెను; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి.

05 ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా యేలినవాడా, అది యెరవు తెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక

06 ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను.

07 అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను.

08 సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను.

09 అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక

10 ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలిసికొని తనవారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచు వచ్చినందున

11 సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారి నడుగగా

12 అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను.

13 అందుకు రాజు మేము మనుష్యులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవియ్యగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను.

14 కాబట్టి రాజు అచ్చటికి గుఱ్ఱములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా

15 దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుఱ్ఱములును రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొనియుండుట కనబడెను. అంతట అతని పనివాడు అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా

16 అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి

17 యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.

18 ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.

19 అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకువానియొద్దకు మిమ్మును తీసికొనిపోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.

20 వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.

21 అంతట ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా

22 అతడు నీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానునియొద్దకు వెళ్లుదురని చెప్పెను.

23 అతడు వారికొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానునియొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను.

24 అటుతరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడివేసెను.

25 అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగియుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మబడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.

26 అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని

27 యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడనుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండి యైనను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి

28 నీ విచారమునకు కారణమేమని యడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు

29 మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను.

30 రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటిమీద గోనెపట్ట కనబడెను.

31 తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.

32 అయితే ఎలీషా తన యింట కూర్చునియుండగా పెద్దలును అతనితోకూడ కూర్చుండియున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి, ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండ తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి; వాని యజమానుని కాళ్లచప్పుడు వానివెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా

33 ఆ దూత అతనియొద్దకు వచ్చెను. అంతట రాజు ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి యుండవలెననెను.