Logo

2రాజులు అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.

02 అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెహోయద్దాను.

03 ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.

04 అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు; జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.

05 రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.

06 అయితే కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.

07 మరియు ఉప్పులోయలో అతడు యుద్ధముచేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.

08 అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరము దర్శించునట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా

09 ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.

10 నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను

11 అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా

12 యూదావారు ఇశ్రాయేలువారి యెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.

13 మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదా రాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.

14 మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.

15 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

16 అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.

17 యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.

18 అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

19 అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.

20 వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.

21 అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి.

22 ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.

23 యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.

24 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.

25 గత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రమువరకు ఇశ్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసికొనెను.

26 ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.

27 యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకాశము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చియుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను.

28 యరొబాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దాని నంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

29 యరొబాము తన పితరులైన ఇశ్రాయేలు రాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.