Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులోనుండు దావీదునొద్దకు కూడి వచ్చి చిత్తగించుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.

02 ఇంతకుముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివి నా జనులగు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.

03 ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూయేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.

04 తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలేమనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.

05 అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.

06 ఎవడు మొదట యెబూసీయులను హతముచేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.

07 తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.

08 దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.

09 సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.

10 ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యమునందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.

11 దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.

12 ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమశాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.

13 ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమ్మీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.

14 వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.

15 ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలోనుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగియుండెను.

16 దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.

17 దావీదు ఆశపడి బేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా

18 ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడిపోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొనివచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి

19 నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.

20 యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.

21 ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.

22 మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్పవాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుల నిద్దరిని చంపెను; మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను.

23 అయిదు మూరల పొడవుగల మంచి యెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱచేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడలాగి దానితో వానిని చంపెను.

24 యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.

25 ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.

26 మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,

27 హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

28 తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

29 హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,

30 నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

31 బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,

32 గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,

33 బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,

34 గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను,

35 హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

36 మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

37 కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

38 నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,

39 అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,

40 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

41 హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,

42 రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటివారగు ముప్పదిమంది,

43 మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,

44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీయేలు,

45 షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,

46 మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,

47 ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.