Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 16

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొనివచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

02 దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి

03 పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచిపెట్టెను.

04 మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.

05 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.

06 బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.

07 ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా

08 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.

09 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.

10 ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక.

11 యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

12 ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా

13 ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.

14 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

15 మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్యగల జనులుగాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

16 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను

17 ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.

18 వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను.

19 యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.

20 వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా

21 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి

22 ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.

23 సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.

24 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి.

25 యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొందతగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

26 జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు.

27 ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

28 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి.

29 యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములుచేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.

30 భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.

31 యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక

32 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.

33 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.

34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.

35 దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.

36 మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.

37 అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదెదోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని

38 యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను

39 గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

40 ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.

41 యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను.

42 బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను.

43 తరువాత జనులందరును తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటివారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.