Logo

యోబు అధ్యాయము 3

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.

02 యోబు ఈలాగు అనెను

03 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగుచేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక.

04 ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

05 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమయొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక

06 అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక సంవత్సరపు దినములలో నేనొకదాననని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక.

07 ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక

08 దినములు అశుభదినములని చెప్పువారు దానిని శపించుదురు గాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురు గాక.

09 అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు లేకపోవును గాక

10 అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని?

11 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని?

12 మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి? నేనేల స్తనములను కుడిచితిని?

13 లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును

14 తమకొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును.

15 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును.

16 అకాల సంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయియుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయియుందును.

17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు

18 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు

19 అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు.

20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖాక్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

21 వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది.

22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

23 మరుగుపడిన మార్గము గలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.