Logo

యోబు అధ్యాయము 11

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

02 ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?

03 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండవలెనా? ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యము చేయుదువా?

04 నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.

05 దేవుడు నీతో మాటలాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు

06 ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధికభాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

07 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా? సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా?

08 అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు? పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?

09 దాని పరిమాణము భూమికంటె అధికమైనది దాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది

10 ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు?

11 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.

12 అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.

13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీచేతులు ఆయనవైపు చాపినయెడల

14 పాపము నీచేతిలోనుండుట చూచి నీవు దాని విడిచినయెడల నీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినయెడల

15 నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు.

16 నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లు నీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.

17 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.

18 నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు.

19 ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.

20 దుష్టుల కనుచూపు క్షీణించిపోవును వారికి ఆశ్రయమేమియు ఉండదు ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.