Logo

కీర్తనలు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

02 నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?

03 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.

04 భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)

05 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి

06 మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.

07 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి.

08 యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.