Logo

కీర్తనలు అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండ గతించిపోయిరి.

02 అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.

03 యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.

04 మా నాలుకలచేత మేము సాధించెదము మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు.

05 బాధపడువారికి చేయబడిన బలాత్కారమునుబట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

06 యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండియంత పవిత్రములు.

07 యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.

08 నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.