Logo

కీర్తనలు అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.

02 నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును.

03 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను

04 మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను.

05 నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.

06 నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము.

07 నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతిలోనుండి నీ కుడిచేత రక్షించువాడా,

08 నీ కృపాతిశయములను చూపుము.

09 ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువులచేత చిక్కకుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము.

10 వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారు వారి నోరు గర్వముగా మాటలాడును.

11 మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొనియున్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు.

12 వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెను ఉన్నారు.

13 యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము

14 లోకుల చేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.

15 నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును.