Logo

కీర్తనలు అధ్యాయము 25

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను.

02 నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింపనియ్యకుము

03 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.

04 యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము.

05 నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.

06 యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసికొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.

07 నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము.

08 యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.

09 న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.

10 ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపా సత్యమయములై యున్నవి

11 యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.

12 యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.

13 అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.

14 యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

15 నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.

16 నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.

17 నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.

18 నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.

19 నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.

20 నేను నీ శరణుజొచ్చియున్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.

21 నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.

22 దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.