Logo

కీర్తనలు అధ్యాయము 44

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనినిగూర్చి మేము చెవులార వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి

02 నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

03 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.

04 దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.

05 నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము.

06 నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు

07 మా శత్రువులచేతిలోనుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.

08 దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.(సెలా.)

09 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.

11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు

12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు

13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టు నున్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

15 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు

16 నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.

17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.

18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

19 అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు

20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మాచేతులు చాపియున్నయెడల

21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

22 నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడుచున్నాము

23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.

24 నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచియున్నావు?

25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.

26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.