Logo

కీర్తనలు అధ్యాయము 71

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము.

02 నీ నీతినిబట్టి నన్ను తప్పింపుము నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము.

03 నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు.

04 నా దేవా, భక్తిహీనులచేతిలోనుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము.

05 నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.

06 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.

07 నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే.

08 నీ కీర్తితోను నీ ప్రభావవర్ణనతోను దినమంతయు నా నోరు నిండియున్నది.

09 వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము.

10 నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు.

11 దేవుడు వానిని విడిచెను తప్పించువారెవరును లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు.

12 దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము

13 నా ప్రాణవిరోధులు సిగ్గుపడి నశించుదురు గాక. నాకు కీడుచేయ జూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక.

14 నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును

15 నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

16 ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములనుబట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.

17 దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.

18 దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.

19 దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటియైనవాడెవడు?

20 అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసినవాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.

21 నా గొప్పతనమును వృద్ధిచేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము

22 నా దేవా, నేనుకూడ నీ సత్యమునుబట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను.

23 నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు

24 వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.