Logo

కీర్తనలు అధ్యాయము 88

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు

02 నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవియొగ్గుము

03 నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.

04 సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని.

05 చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీచేతిలోనుండి తొలగిపోయియున్నారు గదా.

06 అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టియున్నావు.

07 నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా.)

08 నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడియున్నాను

09 బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీవైపు నాచేతులు చాపుచున్నాను.

10 మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా.)

11 సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పుకొందురా?

12 అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?

13 యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.

14 యెహోవా, నీవు నన్ను విడుచుట యేల? నీ ముఖము నాకు చాటు చేయుట యేల?

15 బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.

16 నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహా భయములు నన్ను సంహరించియున్నవి.

17 నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొనియున్నవి

18 నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.