Logo

కీర్తనలు అధ్యాయము 91

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

02 ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.

03 వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును

04 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కలక్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునైయున్నది.

05 రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను

06 చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.

07 నీ ప్రక్కను వేయిమంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీయొద్దకు రాదు.

08 నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును

09 యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు

10 నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు

11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును

12 నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమచేతులమీద ఎత్తి పట్టుకొందురు

13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు.

14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను

15 అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడైయుండెదను అతని విడిపించి అతని గొప్పచేసెదను

16 దీర్ఘాయువుచేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.