Logo

కీర్తనలు అధ్యాయము 138

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.

02 నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను.

03 నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.

04 యెహోవా, భూరాజులందరు నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు.

05 యెహోవా మహా ప్రభావముగలవాడని వారు యెహోవా మార్గములనుగూర్చి గానము చేసెదరు.

06 యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.

07 నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు నా శత్రువుల కోపమునుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును.

08 యెహోవా నా పక్షమున కార్యము సఫలముచేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీచేతి కార్యములను విడిచిపెట్టకుము.