Logo

కీర్తనలు అధ్యాయము 144

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నాచేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.

02 ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నేనాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.

03 యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటి వారు?

04 నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.

05 యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము

06 మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము.

07 పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యుల చేతిలోనుండి నన్ను విడిపింపుము.

08 వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.

09 దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.

10 నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు

11 నన్ను తప్పింపుము అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టిమాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది.

12 మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.

13 మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.

14 మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుటయైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు

15 ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.