Logo

ఆదికాండము అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.

02 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

03 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించు వాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

04 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది యైదేండ్ల యీడు గలవాడు.

05 అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసికొని కనానను దేశమునకు వచ్చిరి

06 అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.

07 యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

08 అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్ధన చేసెను

09 అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.

10 అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.

11 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.

12 ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుకనిచ్చెదరు.

13 నీవలన నాకు మేలు కలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.

14 అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి

15 ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో యెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.

16 అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.

17 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.

18 అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు?

19 ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితేనేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొని పొమ్మని చెప్పెను.

20 మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.