Logo

ఆదికాండము అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.

02 అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తికర్తయగును గదా

03 మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

04 యెహోవా వాక్యము అతనియొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.

05 మరియు ఆయన వెలుపలికి అతని తీసికొనివచ్చి నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను.

06 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

07 మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు

08 అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా

09 ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నాయొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.

10 అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు

11 గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.

12 ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా

13 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు.

14 వారు నాలుగువందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.

15 నీవు క్షేమముగా నీ పితరులయొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.

16 అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.

17 మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.

18 ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా

19 కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను

20 హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను

21 అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.