Logo

సామెతలు అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తనచేతులతో తన యిల్లు ఊడబెరుకును.

02 యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు,

03 మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.

04 ఎద్దులు లేనిచోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును

05 నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

06 అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివి గలవానికి జ్ఞానము సులభము.

07 బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞాన వచనములు వానియందు కనబడవు గదా?

08 తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.

09 మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు.

10 ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు.

11 భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్థిల్లును.

12 ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.

13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును.

14 భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.

15 జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.

16 జ్ఞానము గలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.

17 త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును.

18 జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.

19 చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.

20 దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.

21 తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు.

22 కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.

23 ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.

24 జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.

25 నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.

26 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

27 అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును

28 జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనతవచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.

29 దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.

30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.

31 దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.

32 అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.

33 తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును

34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.

35 బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును