Logo

సామెతలు అధ్యాయము 15

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.

02 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

03 యెహోవా కన్నులు ప్రతి స్థలముమీదనుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.

04 సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.

05 మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.

06 నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.

07 జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు

08 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.

09 భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.

10 మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.

11 పాతాళమును అగాధకూపమును యెహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?

12 అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.

13 సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.

14 బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.

15 బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును.

16 నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.

17 పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుటకంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.

18 కోపోద్రేకి యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.

19 సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.

20 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.

21 బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును.

22 ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.

23 సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!

24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును

25 గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.

26 దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.

27 లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.

28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును

29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.

30 కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.

31 జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.

32 శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకియగును.

33 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.