Logo

ప్రసంగి అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది

02 ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.

03 ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను

04 అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను.

05 అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మది గలది.

06 అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానక యున్నయెడల వాని గతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.

07 మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.

08 బుద్ధిహీనులకంటె జ్ఞానుల విశేషమేమి? సజీవులయెదుట బ్రదుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి?

09 మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే.

10 ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను; ఆ యా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను; తమకంటె బలవంతుడైన వానితో వారు వ్యాజ్యెమాడజాలరు.

11 పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము?

12 నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?