Logo

యెషయా అధ్యాయము 18

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఓహో కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల దేశమా!

02 అది సముద్రమార్గముగా జలములమీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా, యెత్తయినవారును నునుపైన చర్మముగలవారునగు జనమునొద్దకు దూరములోనున్న భీకరజనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశముగలవారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండువారునగు జనమునొద్దకు పోవుడి.

03 పర్వతములమీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు భూమిమీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదునప్పుడు ఆలకించుడి.

04 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవికోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాసస్థలమున కనిపెట్టుచుందును.

05 కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.

06 అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమిమీదనున్న మృగములును వాటిని తినును.

07 ఆ కాలమున ఎత్తయినవారును నునుపైన చర్మముగలవారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.