Logo

యెషయా అధ్యాయము 28

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటి వారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.

02 ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు.

03 త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.

04 ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వానిచేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.

05 ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.

06 ఆయన న్యాయపీఠముమీద కూర్చుండువారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును.

07 అయితే వీరును ద్రాక్షారసమువలన సొక్కి సోలుదురు మద్యమువలన తత్తరపడుదురు యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యమువలన సొక్కి సోలుదురు ద్రాక్షారసము వారిని మింగివేయుచున్నది మద్యమువలన తత్తరపడుచున్నారు దర్శనము కలుగునప్పుడు సోలుదురు తీర్పుతీర్చు కాలమున తత్తరపడుదురు.

08 వారి భోజనపు బల్లలన్నియు వాంతితోను కల్మషములతోను నిండియున్నవి అవి లేనిచోటు లేదు.

09 వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచినవారికా? చన్ను విడిచినవారికా?

10 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు.

11 నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవులచేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు.

12 అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు

13 ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.

14 కాబట్టి యెరూషలేములోనున్న యీ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి

15 మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.

16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియై యున్నది విశ్వసించువాడు కలవరపడడు.

17 నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

18 మరణముతో మీరు చేసికొనిన నిబంధన కొట్టివేయబడును పాతాళముతో మీరు చేసికొనిన ఒడంబడిక నిలువదు ప్రవాహమువలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దానిచేత త్రొక్కబడిన వారగుదురు

19 వచ్చునప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొనిపోవును ప్రతి ఉదయము ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును ఇట్టి ప్రకటన గ్రహించుటవలన మహా భయము పుట్టును.

20 పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.

21 నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.

22 మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింపబడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని

23 చెవియొగ్గి నా మాట వినుడి ఆలకించి నేను పలుకునది వినుడి

24 దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? అతడు దుక్కి పెల్లలు నిత్యము బద్దలగొట్టునా?

25 అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును గదా?

26 వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

27 సేద్యగాడు నల్ల జీలకఱ్ఱ పదునుగల యంత్రముచేత నూర్చడు బండిచక్రములను జీలకఱ్ఱమీద నడిపింపడు గాని కఱ్ఱచేత నల్ల జీలకఱ్ఱను చువ్వచేత జీలకఱ్ఱను దుళ్లగొట్టును గదా?

28 మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు ఎల్లప్పుడును అతడు బండిచక్రమును గుఱ్ఱములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా!

29 జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే