Logo

యెషయా అధ్యాయము 29

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అరీయేలుకు శ్రమ దావీదు దండుదిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరుగనీయుడి.

02 నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును.

03 నేను నీతో యుద్ధముచేయుచు నీచుట్టు శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడిదిబ్బ వేయుదును.

04 అప్పుడు నీవు అణపబడి నేలనుండి పలుకుచుందువు నీ మాటలు నేలనుండి యొకడు గుసగుసలాడు నట్లుండును కర్ణపిశాచి స్వరమువలె నీ స్వరము నేలనుండి వచ్చును నీ పలుకు ధూళిలోనుండి గుసగుసలుగా వినబడును.

05 నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును.

06 ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలలతోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.

07 అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నమువలె ఉందురు.

08 ఆకలిగొన్నవాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.

09 జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు మద్యపానము చేయకయే తూలుచున్నారు.

10 యెహోవా మీమీద గాఢనిద్రాత్మను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకువేసియున్నాడు.

11 దీనినంతటినిగూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథ వాక్యములవలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసినవానికి వానిని అప్పగించును; అతడు అది నావలన కాదు అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును.

12 మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియనివానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియవనును.

13 ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.

14 కాగా నేను మరల ఈ జనులయెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.

15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండ లోలోపల వాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ.

16 అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించినవానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?

17 ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.

18 ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

19 యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

20 బలాత్కారులు లేకపోవుదురు పరిహాసకులు నశించెదరు.

21 కీడుచేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యెమునుబట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయమాటలచేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు.

22 అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమునుగూర్చి యీలాగు సెలవిచ్చుచున్నాడు ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.

23 అతని సంతానపువారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధ పరచుదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరచుదురు ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.

24 చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.