Logo

యెషయా అధ్యాయము 36

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.

02 అంతట అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణమునుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువయొద్ద ప్రవేశింపగా

03 హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహకుడునునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.

04 అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవీలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి?

05 యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టిమాటలే. ఎవని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేయుచున్నావు?

06 నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వానిచేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.

07 మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే; యెరూషలేమందున్న యీ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా యెవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనేగదా యెహోవా.

08 కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.

09 లేనియెడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే.

10 యెహోవా సెలవునొందకయే యీ దేశమును పాడుచేయుటకు నేను వచ్చితినా? లేదు ఆ దేశముమీదికి పోయి దాని పాడుచేయుమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పెను.

11 ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము, ప్రాకారముమీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా

12 రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానునియొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద ఉన్న వారియొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి

13 గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా

14 హిజ్కియాచేత మోసపోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

15 యెహోవానుబట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజుచేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.

16 హిజ్కియా చెప్పినమాట మీరంగీకరింపవలదు; అష్షూరు రాజు సెలవిచ్చునదేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.

17 అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమునుగల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొనిపోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు.

18 ఆ యా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవతలేమాయెను?

19 అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవతలేమాయెను? షోమ్రోను దేశపు దేవత నాచేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

20 యెహోవా నా చేతిలోనుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.

21 అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి.

22 గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.