Logo

యెషయా అధ్యాయము 47

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.

02 తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్టతీసి నదులు దాటుము.

03 నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను.

04 సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు.

05 కల్దీయుల కుమారీ, మౌనముగానుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు.

06 నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్రపరచి వారిని నీచేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడిమ్రానును మిక్కిలి బరువుగా మోపితివి.

07 నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి.

08 కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాటను వినుము

09 ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును.

10 నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను.

11 కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును.

12 నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో

13 నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.

14 వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొనలేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.

15 నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు.