Logo

యిర్మియా అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.

02 యెహోవా జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు.

03 యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు? నీవు వారిని కొట్టితివిగాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింపజేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.

04 నేనిట్లనుకొంటిని వీరు ఎన్నికలేనివారై యుండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరుగక బుద్ధిహీనులై యున్నారు.

05 ఘనులైనవారియొద్దకు పోయెదను వారితో మాటలాడెదను, వారు యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయవిధిని ఎరిగినవారై యుందురుగదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండ వారు కాడిని విరిచినవారుగాను కట్లను తెంపుకొనినవారుగాను ఉన్నారు.

06 వారు తిరుగుబాటుచేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యమునుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణములయొద్ద పొంచియుండును, వాటిలోనుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును.

07 నీ పిల్లలు నన్ను విడిచి దైవము కానివాటి తోడని ప్రమాణము చేయుదురు; నేను వారిని తృప్తిగ పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు; నేనెట్లు నిన్ను క్షమించుదును?

08 బాగుగా బలిసిన గుఱ్ఱములవలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యవెంబడి సకిలించును

09 అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.

10 దాని ప్రాకారము లెక్కి నాశనముచేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి, దాని శాఖలను కొట్టివేయుడి. అవి యెహోవావి కావు.

11 ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బహుగా విశ్వాసఘాతకము చేసియున్నారు; ఇదే యెహోవా వాక్కు.

12 వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరవునైనను చూడమనియు,

13 ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు.

14 కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

15 ఇశ్రాయేలు కుటుంబము వారలారా, ఆలకించుడి, దూరముననుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను, అది బలమైన జనము పురాతనమైన జనము; దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకుమాటలు నీకు బోధపడవు.

16 వారి అమ్ములపొది తెరచిన సమాధి, వారందరు బలాఢ్యులు,

17 వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు, నీ గొఱ్ఱలను నీ పశువులను నాశనము చేయుదురు, నీ ద్రాక్షచెట్ల ఫలమును నీ అంజూరపుచెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములుగల పట్టణములను వారు కత్తిచేత పాడుచేయుదురు.

18 అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషములేకుండ నశింపజేయను; ఇదే యెహోవా వాక్కు.

19 మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

20 యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి

21 కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి.

22 సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.

23 ఈ జనులు తిరుగుబాటును ద్రోహమునుచేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగిపోవుచున్నారు.

24 వారురండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా; నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు.

25 మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము.

26 నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.

27 పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి యిండ్లు కపటముతో నిండియున్నవి, దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులును అగుదురు.

28 వారు క్రొవ్వి బలిసియున్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు, తండ్రిలేనివారు గెలువకుండునట్లు వారి వ్యాజ్యెమును అన్యాయముగా తీర్చుదురు, దీనుల వ్యాజ్యెమును తీర్పునకు రానియ్యరు.

29 అట్టివాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

30 ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది.

31 ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?