Logo

యిర్మియా అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

02 నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.

03 విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.

04 మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.

05 సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.

06 నీ నివాసస్థలము కాపట్యము మధ్యనేయున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.

07 కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?

08 వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.

09 నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

10 పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయియున్నవి, అవి తొలగిపోయియున్నవి.

11 యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.

12 ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?

13 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి

14 తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.

15 సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.

16 తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును, వారిని నిర్మూలము చేయువరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును.

17 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.

18 మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.

19 మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడుచున్నది.

20 స్త్రీలారా, యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

21 వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో యౌవనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

22 యెహోవా వాక్కు ఇదే నీవీమాట చెప్పుము చేలమీద పెంటపడునట్లు పంట కోయువాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.

23 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.

24 అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

25 అన్యజనులందరును సున్నతి పొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతి నొందినవారుకారు గనుక, రాబోవు దినములలో సున్నతిపొందియు సున్నతి లేనివారివలెనుండు

26 ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.