Logo

యిర్మియా అధ్యాయము 13

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెనునీవు వెళ్లి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టు కొనుము, నీళ్లలో దాని వేయకుము.

02 కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.

03 రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై

04 నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా

05 యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.

06 అనేక దినములైన తరువాత యెహోవా నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచిపెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసికొనుమని నాతో చెప్పగా

07 నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయియుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.

08 కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

09 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహా గర్వమును నేను భంగపరచుదును.

10 అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విననొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు.

11 నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

12 కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడును ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయెడల

13 నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేశనివాసులనందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.

14 అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపకపోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను.

15 చెవియొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.

16 ఆయన చీకటి కమ్మజేయకమునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.

17 అయినను మీరు ఆ మాట విననొల్లనియెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.

18 రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.

19 దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్టబడిరి; ఏమియు లేకుండ సమస్తము కొనిపోబడెను.

20 కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది?

21 నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియమించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా?

22 నీవు ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గునొందెను.

23 కూషు దేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.

24 కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.

25 నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

26 కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తుచున్నాను.

27 నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంతకాలము ఈలాగు జరుగును?