Logo

యిర్మియా అధ్యాయము 17

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా

02 యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకల మీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ములమీదను చెక్కబడియున్నది.

03 పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.

04 మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు.

05 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

06 వాడు ఎడారిలోని అరుహావృక్షమువలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.

07 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.

08 వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.

09 హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

10 ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.

11 న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.

12 ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.

13 ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.

14 యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.

15 వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది? దాని రానిమ్మని యనుచున్నారు.

16 నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటనుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.

17 ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.

18 నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులుపడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము.

19 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు నీవు వెళ్లి యూదా రాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మమునను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము

20 యూదా రాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి.

21 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొనిరాకుడి.

22 విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొనిపోకుడి, యే పనియు చేయకుడి, నేను మీ పితరుల కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి.

23 అయితే వారు వినకపోయిరి, చెవినిబెట్టక పోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి.

24 మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుండినయెడల

25 దావీదు సింహాసనమందు ఆసీనులై, రథములమీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూషలేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.

26 మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములోనుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చెదరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొనివచ్చెదరు.

27 అయితే మీరు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.