Logo

యిర్మియా అధ్యాయము 27

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏల నారంభించినప్పుడు యెహోవాయొద్దనుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

02 యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము.

03 వాటిని యెరూషలేమునకు యూదారాజైన సిద్కియాయొద్దకు వచ్చిన దూతలచేత ఎదోము రాజునొద్దకును మోయాబు రాజునొద్దకును అమ్మోనీయుల రాజునొద్దకును తూరు రాజునొద్దకును సీదోను రాజునొద్దకును పంపుము.

04 మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియజేయవలెనని యీ ఆజ్ఞ వారితో చెప్పుము మీరు మీ యజమానులకు తెలియజేయవలెనని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చునదేమనగా

05 అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను.

06 ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.

07 అతని స్వదేశమునకు కాలము వచ్చువరకు సమస్తజనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులైయుందురు, ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతనిచేత దాస్యము చేయించుకొందురు.

08 ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజుయొక్క కాడిని తన మెడమీద పెట్టుకొనదో దానిని నేను అతనిచేత బొత్తిగా నాశనము చేయించువరకు ఆ జనమును ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను శిక్షించెదను; ఇదే యెహోవా వాక్కు.

09 కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాండ్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునపుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి.

10 మీరు మీ భూమిని అనుభవింపకుండ మిమ్మును దూరముగా తోలివేయునట్లును, మిమ్మును నేను వెళ్లగొట్టునట్లును, మీరు నశించునట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు.

11 అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్య పరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగజేతును; ఇదే యెహోవా వాక్కు.

12 నేను ఆ మాటలనుబట్టి యూదారాజైన సిద్కియాతో ఇట్లంటిని బబులోను రాజుయొక్క కాడిని మీ మెడమీద పెట్టుకొని, అతనికిని అతని జనులకును దాసులైనయెడల మీరు బ్రదుకుదురు

13 బబులోను రాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?

14 కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్దమే ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారి మాటల నంగీకరింపవద్దు, ఇదే యెహోవా వాక్కు.

15 నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించునట్లును, వారు నా నామమునుబట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోను ఈ ప్రజలందరితోను నేను ఈ మాటలు చెప్పితిని

16 యెహోవా సెలవిచ్చునదేమనగా యెహోవా మందిరపు ఉపకరణములు ఇప్పుడే శీఘ్రముగా బబులోనునుండి మరల తేబడునని ప్రవచింపు మీ ప్రవక్తలు మీతో అబద్ధములు చెప్పుచున్నారు, వారి మాటలకు చెవియొగ్గకుడి.

17 వారి మాట వినకుడి; బబులోను రాజునకు దాసులైనయెడల మీరు బ్రదుకుదురు; ఈ పట్టణము పాడైపోనేల?

18 వారు ప్రవక్తలైనయెడల, యెహోవా వాక్కు వారికి తోడైయుండినయెడల, యెహోవా మందిరములోను యూదారాజు మందిరములోను యెరూషలేములోను శేషించియుండు ఉపకరణములు బబులోనునకు కొనిపోబడకుండునట్లు వారు సైన్యములకధిపతియగు యెహోవాను బతిమాలుకొనుట మేలు.

19 బబులోను రాజైన నెబుకద్రెజరు యెరూషలేములోనుండి యెహోయాకీము కుమారుడైన యెకోన్యాను యూదా యెరూషలేముల ప్రధానులనందరిని బబులోనునకు చెరగా తీసికొనిపోయినప్పుడు

20 అతడు విడిచిపెట్టిన స్తంభములనుగూర్చియు సముద్రమునుగూర్చియు గడమంచెలనుగూర్చియు ఈ పట్టణములో మిగిలిన ఉపకరణములనుగూర్చియు సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.

21 యెహోవా మందిరములోను యూదా రాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు

22 అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలమువరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.