Logo

యిర్మియా అధ్యాయము 31

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనైయుందును, వారు నాకు ప్రజలైయుందురు.

02 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతినొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు.

03 చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.

04 ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు.

05 నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు.

06 ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.

07 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతి చేయుడి యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.

08 ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగివచ్చెదరు

09 వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగాపోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?

10 జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.

11 యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వానిచేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు

12 వారు వచ్చి సీయోను కొండమీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలెనుందురు.

13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు.

14 క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.

15 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారినిగూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

16 యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగివచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను.

19 నేను తిరిగిన తరువాత పశ్చాత్తాప పడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.

20 ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దుబిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.

21 ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగిరమ్ము.

22 నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.

23 ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు--చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు.

24 అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును,కృశించిన వారినందరిని నింపుదును.

25 కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు.

26 అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను.

27 యెహోవా వాక్కు ఇదే ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి.

28 వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.

29 ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు.

30 ప్రతివాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.

31 ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.

32 అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.

33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

34 నేను వారికి దేవుడనైయుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు.

35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

36 ఆ నియమములు నా సన్నిధినుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు.

37 యెహోవా సెలవిచ్చునదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసివేతును; యెహోవా వాక్కు ఇదే.

38 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును.

39 కొలనూలు దాని కెదురుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును.

40 శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.