Logo

యెహెజ్కేలు అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయుము.

02 మరియు అది ముట్టడి వేయబడినట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.

03 మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖదృష్టిని పట్టణముమీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడివేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.

04 మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు.

05 ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.

06 ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సరమొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను.

07 ఈలాగు నీవుండగా యెరూషలేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.

08 పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును.

09 మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;

10 నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళ వేళకు తినవలెను,

11 నీళ్లు కొల ప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేళ వేళకు త్రాగవలెను;

12 యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;

13 నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.

14 అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటివరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా

15 ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించియున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి

16 నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు.

17 అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.