Logo

యెహెజ్కేలు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు నరపుత్రుడా, నీవు మంగలకత్తివంటి వాడిగల కత్తియొకటి తీసికొని నీ తలను గడ్డమును క్షౌరము చేసికొని, త్రాసు తీసికొని ఆ వెండ్రుకలను తూచి భాగములు చేయుము.

02 పట్టణమును ముట్టడివేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి, రెండవ భాగమును తీసి ఖడ్గముచేత హతముచేయు రీతిగా దానిని చుట్టు విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిమ్ము; నేను ఖడ్గముదూసి వాటిని తరుముదును.

03 అయితే వాటిలో కొన్నిటిని తీసికొని నీ చెంగున కట్టుకొనుము;

04 పిమ్మట వాటిలో కొన్నిటిని మరల తీసి అగ్నిలోవేసి కాల్చుము; దానినుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారినందరిని తగులబెట్టును.

05 మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది యెరూషలేమే గదా, అన్యజనులమధ్య నేను దాని నుంచితిని, దానిచుట్టు రాజ్యములున్నవి.

06 అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టునున్న అన్యజనులకంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి

07 కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా కట్టడల ననుసరింపకయు నా విధులను గైకొనకయు నుండువారై, మీ చుట్టునున్న అన్యజనులకు కలిగియున్న విధులనైనను అనుసరింపక, మీరు మీ చుట్టునున్న దేశస్థులకంటె మరి యధికముగా కఠినహృదయులైతిరి.

08 కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును.

09 నీ హేయ కృత్యములనుబట్టి పూర్వమందు నేను చేయని కార్యమును, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును.

10 కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించినవారిని నలుదిశల చెదరగొట్టుదును.

11 నీ హేయదేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటిచేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టియైనను జాలియైనను లేక నేను నిన్ను క్షీణింపజేసెదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

12 కరవు వచ్చియుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణమవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.

13 నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారిమీద నా ఉగ్రత తీర్చుకొను కాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసికొందురు

14 ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.

15 కావున నీ పోషణాధారము తీసివేసి, నీమీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా

16 నీ చుట్టునున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు; యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను.

17 ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్రహీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.