Logo

యెహెజ్కేలు అధ్యాయము 7

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది.

03 నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను.

04 నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానై యున్నానని నీవెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను, నీ హేయ కృత్యములు నీమధ్యనే యుండనిత్తును.

05 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది,

06 అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయెను.

07 దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహధ్వని కాదు శ్రమ ధ్వనియే పర్వతములమీద వినబడుచున్నది.

08 ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను.

09 యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీయెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను, నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును.

10 ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించునదాయెను.

11 వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు.

12 కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు.

13 వారు బ్రదికియున్నను అమ్మువాడు అమ్మినదానికి తిరిగిరాడు, ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరుగును, వారందరు దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరును ధైర్యము చేయరు.

14 వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.

15 బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును.

16 వారిలో ఎవరైనను తప్పించుకొనినయెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు.

17 అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.

18 వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరు సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును.

19 తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియేగాని బంగారమేగాని వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు.

20 శృంగారమైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి, దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను,

21 వారు దాని అపవిత్రపరచునట్లు అన్యులచేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను.

22 వారిని చూడకుండ నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధిస్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు.

23 దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్లు సిద్ధపరచుము.

24 బలాఢ్యుల యతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధస్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను; ఆ దుష్టులు వారి యిండ్లను స్వతంత్రించుకొందురు.

25 సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు.

26 నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది; వారు ప్రవక్తయొద్ద దర్శనముకొరకు విచారణ చేయుదురుగాని యాజకులు ధర్మశాస్త్రజ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే యున్నారు.

27 రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషములనుబట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.