Logo

యెహెజ్కేలు అధ్యాయము 9

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు నేను చెవులార వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.

02 అంతలో ఒక్కొకడు తాను హతముచేయు ఆయుధమును చేతపట్టుకొని, ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుష్యులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు, అవిసెనారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొనియుండెను; వారు ఆలయమున ప్రవేశించి యిత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి.

03 ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసెనారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా

04 యెహోవా యెరూషలేమను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టు తిరిగి, దానిలో జరిగిన హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నవారి లలాటముల గురుతు వేయుమని వారి కాజ్ఞాపించి

05 నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.

06 అందరు నశించునట్లు ఎవరిని విడిచిపెట్టక, పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను గాని, ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతముచేయ మొదలుపెట్టగా

07 ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైనవారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి.

08 నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా

09 ఆయన నాకీలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలు వారి యొక్కయు యూదావారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది; వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు ననుకొని, దేశమును హత్యతోను పట్టణమును తిరుగుబాటుతోను నింపియున్నారు.

10 కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను.

11 అప్పుడు అవిసెనారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనినవాడు వచ్చి నీవు నాకాజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసెను.