Logo

యెహెజ్కేలు అధ్యాయము 22

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

02 నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.

03 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసికొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి,

04 నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను.

05 సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదానవనియు నిన్ను అపహసింతురు.

06 నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్య చేయుదురు,

07 నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,

08 నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.

09 కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి.

10 తమ తండ్రి మానాచ్ఛాదనము తీయువారు నీలో నున్నారు, అశుచియై బహిష్టియైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.

11 ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.

12 నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

13 నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నాచేతులు చరచుకొనుచున్నాను.

14 నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై

15 అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును.

16 అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్ఠుడవై నేను యెహోవానని నీవు తెలిసికొందువు.

17 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

18 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మష్టువంటివారైరి.

19 కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరందరును మష్టువంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

20 నా కోపముచేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.

21 మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు.

22 కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు.

23 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

24 నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుము నీవు పవిత్రము కాని దేశమువై యున్నావు

25 ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లు వారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు,

26 దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.

27 దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.

28 మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టి సోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.

29 మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.

30 నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు.

31 కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.