Logo

యెహెజ్కేలు అధ్యాయము 25

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారినిగూర్చి యీ మాట ప్రవచింపుము.

03 అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నా పరిశుద్ధస్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడుచేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు, మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక

04 నేను మిమ్మును తూర్పుననుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను, వారు తమ డేరాలను మీ దేశములోవేసి మీ మధ్య కాపురముందురు, వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు.

05 నేను రబ్బా పట్టణమును ఒంటెలసాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

06 మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు

07 నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలముచేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.

08 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇతర జనములన్నిటికిని యూదా వారికిని భేదమేమియని మోయాబీయులును శేయీరు పట్టణపువారును అందురు గనుక

09 తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;

10 జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.

11 నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.

12 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చుకొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

13 ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడుచేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

14 నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నా కోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

15 మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫీలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశము చేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక

16 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.

17 క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారిమీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.