Logo

యెహెజ్కేలు అధ్యాయము 30

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

02 నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే,

03 యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.

04 ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు.

05 కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.

06 యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తును ఉద్ధరించువారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.

07 పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణములుండును.

08 ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

09 ఆ దినమందు దూతలు నా యెదుటనుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చేయున్నది.

10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోనురాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.

11 జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.

12 నైలునదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమ్మివేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడు చేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను

13 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుటకెవడును లేకపోవును, ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను.

14 పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.

15 ఐగుప్తునకు కోటగానున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను

16 ఐగుప్తు దేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.

17 ఓనువారిలోను పిబేసెతు వారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.

18 ఐగుప్తుపెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు.

19 నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

20 పదకొండవ సంవత్సరము మొదటినెల యేడవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

21 నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

22 నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్నదానిని విరిగిపోయిన దానిని అతని రెండుచేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.

23 ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

24 మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బ తినినవాడై మూల్గులిడును.

25 బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరోచేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తు దేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.

26 నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.