Logo

దానియేలు అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరియొక దర్శనము కలిగెను.

02 నేను దర్శనము చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను.

03 నేను ఊలయి యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.

04 ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమము గాను ఉత్తరము గాను దక్షిణము గాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.

05 నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటనుండి వచ్చి, కాళ్లు నేల మోపకుండ భూమి యందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.

06 ఈ మేకపోతు నేను నదిప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.

07 నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రము గలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.

08 ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను; విరిగినదానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను,

09 ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి యొక చిన్నకొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.

10 ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను

11 ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.

12 అతిక్రమము జరిగినందున అనుదినబలిని నిలుపుచేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.

13 అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదినబలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువునుగూర్చియు కలిగిన యీ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునోయనియు మాటలాడుకొనిరి.

14 అందుకతడు రెండువేల మూడువందల దినముల మట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.

15 దానియేలను నేను ఈ దర్శనము చూచితిని; దాని తెలిసికొనదగిన వివేకము పొందవలెనని యుండగా; మనుష్యుని రూపము గల యొకడు నాయెదుట నిలిచెను.

16 అంతట ఊలయి నదీతీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అది గబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.

17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమునుగూర్చినదని తెలిసికొనుమనెను.

18 అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.

19 మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమునుగూర్చినది

20 నీవు చూచిన రెండు కొమ్ములుగల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది.

21 బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు; దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్దకొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది.

22 అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా; నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు.

23 వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తి యగుచుండగా, క్రూరముఖము గలవాడును యుక్తి గలవాడునై యుండి, ఉపాయము తెలిసికొను ఒక రాజు పుట్టును.

24 అతడు గెలుచును గాని తన స్వబలమువలన గెలువడు; ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు, ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను, అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును.

25 మరియు నతడు ఉపాయము కలిగినవాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును; అతడు అతిశయపడి తన్నుతాను హెచ్చించుకొనును; క్షేమముగా నున్న కాలమందు అనేకులను సంహరించును; అతడు రాజాధిరాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనమువలన కొట్టివేయబడును.

26 ఆ దినములనుగూర్చిన దర్శనమును వివరించియున్నాను. అది వాస్తవము, అది యనేకదినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను.

27 ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్ఛిల్లి కొన్నాళ్లు వ్యాధిగ్రస్తుడనై యుంటిని; పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని. ఈ దర్శనమునుగూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగల వాడెవడును లేకపోయెను.