Logo

దానియేలు అధ్యాయము 10

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 పారసీకరాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసినదాయెను.

02 ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని.

03 మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.

04 మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని.

05 నేను కన్నులెత్తి చూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను.

06 అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను

07 దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి.

08 నేను ఒంటరినై యా గొప్ప దర్శనమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు.

09 నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని.

10 అప్పుడొకడుచేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి

11 దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీయొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.

12 అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని

13 పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

14 ఈ దర్శనపు సంగతి ఇంక అనేకదినముల వరకు జరుగదు; అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పెను.

15 అతడీమాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.

16 అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,

17 నా యేలిన వాని దాసుడనైన నేను నా యేలినవాని యెదుట ఏలాగున మాటలాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడువలేక యున్నానని చెప్పగా

18 అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయపడకుము,

19 నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకొమ్ము. ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి గనుక నా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని.

20 అతడు నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును.

21 అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.