Logo

హోషేయ అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలు వారలారా, చెవినిబెట్టి ఆలోచించుడి; రాజసంతతి వారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.

02 వారు మితి లేకుండ తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును.

03 ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలు వారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి.

04 తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.

05 ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు; వారితోకూడ యూదా వారును తొట్రిల్లుచున్నారు.

06 వారు గొఱ్ఱలను ఎడ్లను తీసికొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును.

07 యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు.

08 గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి.

09 శిక్షాదినమున ఎఫ్రాయిము పాడైపోవును; నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను.

10 యుదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలె నున్నారు; నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.

11 ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతినిబట్టి ప్రవర్తింప గోరువారు; వారికధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు బాధింపబడుదురు.

12 ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును.

13 తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.

14 ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటివాడనుగాను యూదా వారికి కొదమసింహము వంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును

15 వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు.