Logo

హోషేయ అధ్యాయము 12

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్దమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.

02 యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును.

03 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను.

04 అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;

05 యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.

06 కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక నుంచుము.

07 ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలెనన్న కోరిక వారికి కలదు.

08 నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనినిబట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.

09 అయితే ఐగుప్తు దేశములోనుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును.

10 ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి యున్నాను, ఉపమానరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తలద్వారా మాటలాడి యున్నాను.

11 నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నిన చేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి

12 యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱలు కాచెను.

13 ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను.

14 ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతని నవమానపరతును.