Logo

నిర్గమకాండము అధ్యాయము 8

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఫరోయొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;

02 నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.

03 ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకుల యిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;

04 ఆ కప్పలు నీమీదికి నీ జనులమీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను.

05 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా

06 అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.

07 శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేసిరి.

08 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నాయొద్దనుండి నా జనులయొద్దనుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను

09 అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీమీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని అతడు ఫరోను అడుగగా అతడు రేపే అనెను

10 అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును;

11 అనగా కప్పలు నీయొద్దనుండియు నీ యిండ్లలోనుండియు నీ సేవకులయొద్దనుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగిపోవును; అవి యేటిలోనే ఉండుననెను.

12 మోషే అహరోనులు ఫరోయొద్దనుండి బయలువెళ్లినప్పుడు యెహోవా ఫరోమీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱపెట్టగా

13 యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.

14 జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.

15 ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయెను.

16 అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.

17 అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను

18 శకునగాండ్రుకూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరి గాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా

19 శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.

20 కాబట్టి యెహోవా మోషేతొ నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.

21 నీవు నా ప్రజలను పోనియ్యనియెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయుల యిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.

22 మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులుండవు.

23 నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.

24 యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకుల యిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.

25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా

26 మోషే అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నులయెదుట అర్పించినయెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.

27 మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలినర్పించుదుమనెను.

28 అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలినర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడుకొనుడనెను.

29 అందుకు మోషే నేను నీయొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరోయొద్దనుండియు అతని సేవకులయొద్దనుండియు అతని జనులయొద్దనుండియు తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి

30 ఫరోయొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.

31 యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరోయొద్దనుండియు అతని సేవకులయొద్దనుండియు అతని ప్రజలయొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.

32 అయితే ఫరో ఆ సమయమునకూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.